మహా నిమజ్జనానికి 30వేల మంది పోలీసులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో శనివారం జరగనున్న మహా నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్‌తో పాటు మహానగరం పరిధిలో 20చోట్ల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్‌లోని ఎన్‌టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్కు వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. క్రేన్లు, కంట్రోల్ రూమ్‌లు, మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశాయి. సరూర్‌నగర్, ఐడీఎల్, సఫిల్‌గూడ, సున్నం చెరువుతోపాటు 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనం చేపట్టనున్నారు. ఇప్పటికే 1.25 లక్షల విగ్రహాలు (చిన్నవి, పెద్దవి) నిమజ్జనమైనట్టు జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. నిమజ్జనం రోజున 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పోలీస్‌శాఖ స్పష్టం చేసింది. పారామిలిటరీ, రిజర్వ్ ఫోర్స్‌తో పాటు జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది, అధికారులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.


