కాకతీయ, బిజినెస్ డెస్క్: బంగారం ఎప్పటినుంచో అలంకరణకు మాత్రమే కాకుండా, ఒక సురక్షిత పెట్టుబడి మార్గంగానూ కొనసాగుతోంది. ముఖ్యంగా అధిక ఆదాయం ఉన్న వారు పసిడి వైపు మరింతగా ఆకర్షితులవుతున్నారు. గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మార్పులు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు వంటి కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే శుక్రవారం మాత్రం బంగారం కొనుగోలు దారులకు కొంత ఊరట లభించింది. అన్ని క్యారెట్ల బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్‌లో గత గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,860 వద్ద ఉండగా, శుక్రవారం రూ.10 తగ్గి రూ.1,06,850కు చేరింది. అదే విధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,650 నుంచి రూ.97,640కు తగ్గింది. 18 క్యారెట్ల ధర రూ.80,140 నుంచి రూ.80,130కు తగ్గింది. ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, పసిడి కొనుగోలు దారులకు ఇది కొంత ఊరట కలిగించినట్లే.
ఇక వెండి విషయానికొస్తే, బంగారం ధరలతో సంబంధం లేకుండా గత కొన్ని రోజులుగా వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 100 గ్రాముల వెండి ధర రూ.13,700 వద్ద ఉండగా, శుక్రవారం అది రూ.13,690కి పడిపోయింది. కేజీ వెండి ధర రూ.1,37,000 నుంచి రూ.1,36,900కు తగ్గింది. అంటే 100 గ్రాములపై రూ.10, కేజీపై రూ.100 మేర తగ్గింది. వెండి మార్కెట్‌లో ఈ క్రమశిక్షణ తగ్గుదల కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పూణెలో రూ.10,686గా ఉండగా, ఢిల్లీలో మాత్రం రూ.10,701గా ఉంది. ఇది మార్కెట్ పరిస్థితులు, స్థానిక డిమాండ్, పన్నుల వ్యత్యాసాలు ఆధారంగా మారుతుంటాయి.
పసిడి ధరలు ఒకవైపు రికార్డులు సృష్టిస్తుండగా, మరోవైపు వెండి ధరలు తగ్గిపోవడం పెట్టుబడిదారులకు ఆలోచన కలిగిస్తోంది. నిపుణులు చెబుతున్నట్లుగా, బంగారం ఎప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనంగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆభరణాలు కొనుగోలు చేసేప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.


