కాకతీయ, గీసుగొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో గురువారం హైదారాబాద్ నుండి జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఇందులో హౌసింగ్ అధికారులు, పీడీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీసుగొండ ఇన్చార్జి ఎంపిడిఓ పాక శ్రీనివాస్ మాట్లాడుతూ… లబ్ధిదారులు బిల్లుల కోసం ఇకపై ఆలస్యం చేయాల్సిన అవసరం లేదని, ఇందిరమ్మ ఇండ్లు యాప్ ద్వారా లబ్ధిదారులే ఫోటోలు నేరుగా అప్లోడ్ చేసుకోవచ్చని, వివరాలు యాప్‌లో నమోదు చేసిన వెంటనే ఏఈ లాగిన్‌కి చేరుతాయని తెలిపారు.
రెండు రోజుల్లో ఏఈ పరిశీలన జరిపి బిల్ సిఫారసు చేయగానే వారం రోజుల్లో డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి అని తెలిపారు. ఇప్పటికే మండలంలోని 21 గ్రామాలకు మంజూరైన 299 ఇండ్లలో, మొదటి బిల్ కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున 125 మందికి, రెండో బిల్ కింద 12 మందికి నిధులు జమ అయినట్లు వివరించారు.
ఉచిత ఇసుక కోసం పంచాయతీ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ సూచించారు. యాప్‌లో సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 18005995991 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జూమ్ మీటింగ్‌లో హౌసింగ్ ఏఈ వినోద్ తదితరులు పాల్గొన్నారు.


