కాకతీయ, జనగామ : జిల్లాకేంద్రంలోని బతుకమ్మకుంటను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ సూచించారు. గురువారం వారు సంబంధిత అధికారులతో కలిసి బతుకమ్మకుంట పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అందమైన రంగులతో ఏర్పాటు చేసిన గ్రిల్స్, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బెంచ్‌లను పరిశీలించారు. వాకింగ్ ట్రాక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాచ్ టవర్స్, ఐ లవ్ జనగామ బ్యూటీఫికేషన్ పనులు చూపరులను ఆకర్షించేలా ఉండాలని సూచించారు. చిల్డ్రన్స్ పార్క్, లైటింగ్ పనులను పరిశీలించిన అధికారులు, పనులను వేగంగా ముగించాలని ఆదేశించారు.
పార్కులో నాటే మొక్కల కోసం ముందుగా ఎర్రమట్టి పోసి, ఆపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నాటాలని సూచించారు. నీటి శుభ్రతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


