కాకతీయ, నేషనల్ డెస్క్: దేశవ్యాప్తంగా లక్షలాది ఇన్సూరెన్స్ పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం వరకు పన్ను వసూలు అవుతూ ఉండేది. ఈ నిర్ణయంతో ఇకపై పాలసీదారులు ఆ పన్ను భారాన్ని భరించాల్సిన అవసరం లేదు.
జీఎస్టీ రద్దుతో, ఒకవైపు సాధారణ కుటుంబాలకు నెలవారీ, వార్షిక ఖర్చుల్లో తగ్గుదల కనిపించనుంది. మరోవైపు ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రక్షణ మరింత అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడంలో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతదేశంలో ఇప్పటికీ ఆరోగ్య బీమా కవరేజ్ చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ప్రజల్లో పెద్ద భాగం వైద్య ఖర్చులను స్వయంగా భరించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను మినహాయింపు కలగడంతో మరింత మంది హెల్త్ ఇన్సూరెన్స్ వైపు ఆకర్షితులు అవుతారని భావిస్తున్నారు. ఇదే సమయంలో, లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా కొత్త పాలసీదారులను ఆకర్షించగలదని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం ప్రజలకు ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణను సరసమైనదిగా చేయడమే లక్ష్యమని తెలిపారు. దీని ద్వారా ఇన్సూరెన్స్ రంగంలో కొత్త పెట్టుబడులు పెరగడం, కంపెనీలకు ప్రోత్సాహం లభించడం ఖాయం. మొత్తంగా, జీఎస్టీ రద్దు ఇన్సూరెన్స్ రంగానికి బూస్ట్ ఇవ్వడమే కాకుండా, సామాన్య ప్రజలకు దీర్ఘకాలిక ఆర్థిక రక్షణ కలిగించే దిశగా ఒక కీలక అడుగుగా నిలిచింది. సెప్టెంబర్ 22 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తున్నాయి.


