జీతాలు రావడం లేదని పారిశుధ్య కార్మికుడి ఆత్మహత్య
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మైదం మహేష్ (38) జీతాలు రాక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం, మహేష్ మునుపటికి ములుగు గ్రామపంచాయతీలో పనిచేసేవాడు. గ్రామ పంచాయతీలు మునిసిపాలిటీలో విలీనం అయిన తర్వాత గతంలో గ్రామపంచాయతీలో రావలసిన వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోందని కుటుంబ సభ్యుల తెలిపారు. నెలల తరబడి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాడని తోటి కార్మికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం తీవ్ర మనోవేదనకు గురైన మహేష్ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు పురుగుల మందు తాగిన మహేష్ ను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.
ఈ వార్త తెలిసి తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి సీతక్క స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహేష్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహేష్ మృతితో కార్మిక వర్గం దిగ్భ్రాంతికి గురైంది. ములుగు మున్సిపాలిటీ ముందు మహేష్ కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. మహేష్ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుని గుర్తుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.


