కాకతీయ, మహబూబ్‌నగర్ : దశాబ్దాల కరవు, వలసలు, వెనుకబాటుతనం నుంచి బయటపడి పాలమూరును ఉన్నత స్థానంలో నిలబెట్టడం తన నైతిక ధర్మమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని వేముల గ్రామంలో ఎస్‌జీడీ, కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ నిర్మించిన నూతన యూనిట్‌ను సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఒకనాడు వలసలకు మారుపేరుగా ఉండేదని గుర్తుచేసిన సీఎం, విద్యే మన తలరాతను మార్చగలదన్నారు. అందుకే జిల్లాలో ఇంజనీరింగ్, లా, మెడికల్ కాలేజీలు, బాసర తర్వాత రెండో ట్రిపుల్ ఐటీ, 14 నియోజకవర్గాల్లో 14 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, ఏటీసీలను ఏర్పాటు చేశామని తెలిపారు.
పేద పిల్లలు చదువులో ముందుకు రావడం కోసం అన్ని వసతులు కల్పిమని స్పష్టం చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత పాలకులు ఆటంకాలు కలిగించారని విమర్శించిన ఆయన, ఉద్ధండాపూర్, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాంతాలకు నీళ్ల కోసం గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామని, మంచి నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతులను కార్యాలయాలకు పిలవకుండా, అధికారులు క్షేత్రస్థాయిలో కలుసుకోవాలని సూచించారు. బ్రహ్మోస్ మిస్సైల్ ఉత్పత్తి యూనిట్, డ్రైపోర్టు, హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్టులను పాలమూరులోనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
విదేశీ బృందాలు ఒకనాడు పాలమూరు పేదరికాన్ని చూసేందుకు వచ్చాయి. ఇకపై ఇక్కడి అభివృద్ధిని, పరిశ్రమలను, విద్యా వసతులను చూడటానికి రావాలని, స్థానిక యువతకే కాక, ఇతర రాష్ట్రాల వారికీ ఉపాధి కల్పించే స్థాయికి పాలమూరు ఎదగాలి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, లోక్‌సభ సభ్యుడు మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


