కాకతీయ, గీసుగొండ: రైతులు ఉద్యాన పంటల్లో నానో యూరియా వాడి భూసారాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. బుధవారం గీసుగొండ మండలంలోని రైతు తిమ్మాపురం శ్రీకాంత్ వంకాయ తోటలో డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీగజాతి కూరగాయలైన సోరకాయ, బీరకాయ,దొండకాయ, దోసకాయ,పొట్లకాయ, బోడకాయ వంటి పంటల్లో డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ చేయడం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం పెరిగి మొక్కల ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు.ఘన రూపంలోని యూరియా వాడితే పంటలకు తగిన మోతాదులో అందక మిగతా భాగం వృథా అవుతుందని చెప్పారు.
పందిళ్లపై సాగు చేసే శాశ్వత తీగజాతి కూరగాయలతో పాటు అరటి, బొప్పాయి, మొనగ వంటి ఎత్తైన ఉద్యాన పంటల్లో కూడా డ్రోన్ సాయంతో 10 నిమిషాల్లోనే ఎకర విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానాధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ,తహసీల్దార్ రియాజుద్దీన్,ఉద్యాన అధికారి తిరుపతి,మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, ఇన్చార్జ్ ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఊకల సొసైటీ చైర్మన్ బొమ్మాల రమేష్, హెచ్ఈఓ వేణు,ఏఈఓ రజని, కావ్య,రైతులు పాల్గొన్నారు.


