కాకతీయ, భూపాలపల్లి : రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొని వినాయకుడికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో నిర్మించిన కాలేశ్వరం పై, కేసీఆర్ పై అక్రమంగా సీబీఐ విచారణకు అప్పగించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రైతులకు ఎరువులు సకాలంలో అందించకుండా కేవలం కక్ష పూరిత రాజ కీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.
వెంటనే యూరియా సరఫరా చేసి, కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తరువాత కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


