కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో మంగళవారం ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున, నాగచైతన్య హాజరయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇద్దరూ దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణలో భాగంగా వారు కోర్టుకు వెళ్లి స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాగార్జున మాట్లాడుతూ.. మేం వేసిన పరువు నష్టం కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు మా వాంగ్మూలం ఇచ్చాం. నిజాన్ని న్యాయస్థానంలో స్పష్టం చేశాం. కేసు ఇంకా నడుస్తోంది కాబట్టి వివరాలు చెప్పడం ఇష్టంలేదు అని అన్నారు.
కొండా సురేఖ గతంలో అక్కినేని కుటుంబంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలు తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన నాగార్జున, నాగచైతన్య కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పరువు నష్టం దావా దాఖలు చేసి న్యాయం కోరారు. నాంపల్లి కోర్టు ఇప్పటికే కేసు విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. సినీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ కేసు ఆసక్తికర చర్చనీయాంశమైంది. అక్కినేని కుటుంబం లీగల్‌గా ముందుకు వెళ్లడంపై అభిమానులు మద్దతు పలుకుతున్నారు.
ఈ కేసు తీర్పు ఎలా వెలువడుతుందో చూడాలి కానీ, ఒకవైపు సినిమా ప్రపంచంలో బిజీగా ఉన్న నాగార్జున, నాగచైతన్యలు కోర్టులో హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది


