కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ కు సంబంధించిన సన్నాహకాలు షురూ అయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఆ నియోజకవర్గానికి ఉపఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 2,04,288 మంది, మహిళా ఓటర్లు 1,88,356 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ కు చెందినవారు 25 మంది ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో 139 లొకేషన్లలో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు కోసం సెప్టెంబర్ 17వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 24వ తేదీలోపు ఫిర్యాదులు, అర్జీల పరిష్కారం పూర్తిచేయనున్నారు. తర్వాత సెప్టెంబర్ 30, 2025న తుదీ ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ద్రుష్ట్యా ఈ ఓటర్ల జాబితా అత్యంత కీలకంగా మారింది.


