మెస్ బకాయిలు, స్కాలర్షిప్స్ విడుదల చేయాలి: ఏబీవీపీ డిమాండ్

కాకతీయ, హైదరాబాద్ : పెండింగ్ లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఏబివిపి డిమండ్ చేసింది. ఏబివిపి సికింద్రాబాద్ పీజీ కళాశాల ఆధ్వర్యములో పెండింగ్ లో ఉన్న మెస్ బకాయిలు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మీడియా సమావేశానికి ఏబివిపి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ అలివేలి రాజు హాజరై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 8300 కోట్ల స్కాలర్షిప్స్ మరియు సికింద్రాబాద్ పీజీ కళాశాల కు రావాల్సిన 9 కోట్ల మేస్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పీజీ కళాశాల లో చదువుకొనే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన డిగ్రీ మరియు పీజీ విద్యార్థులు, స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేకపోవడం నిజంగా బాధాకరం. పేరుకేమో ప్రభుత్వ కళాశాల కానీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మరియు మెస్ బకాయిలు రాక వాళ్ల చేతుల్లో నుండి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి .విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది ప్రభుత్వ బిక్ష కాదని, విద్యార్థుల హక్కు అని అన్నారు. రాష్ట్రంలోని వేలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడం తో విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. స్కాలర్షిప్ అందని కారణంగా విద్యార్థులు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (TCలు), మెమోలు తీసుకోలేక, వారి పై చదువులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థుల వద్ద కొన్ని కార్పొరేట్ కళాశాలలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పరిస్థితిని అరికట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను మరియు మెస్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలు రాజు, సికింద్రాబాద్ జిల్లా కన్వినర్ బాలకృష్ణ, హైదరాబాద్ మహానగర SFD కన్వినర్ పాండురంగ్, బేగంపేట్ టౌన్ సెక్రటరీ పవన్ చౌహన్, బేగంపేట్ జాయింట్ సెక్రెటరీ కృష్ణ, విద్యార్థి నాయకులు దుర్గేష్, భాను, రామ్, అపర్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.


