*“వేలిముద్ర లేక యూరియా బస్తా రాదు”
*రైతు కష్టానికి క్యూల కష్టం”
*యూరియా కోసం చెప్పుల క్యూలు – రైతుల దుస్థితి
*ఎకరానికి ఒక్క బస్తా – రైతుల నిరాశ
*ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్క బస్తా మాత్రమే
కాకతీయ, సంగెం (గ్రౌండ్ రిపోర్ట్): పంటల పెరుగుదల కోసం తప్పనిసరి అయిన యూరియా ఎరువు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం మొదలుకొని గంటల తరబడి సొసైటీ ముందు లైన్లలో నిలబడాల్సి వస్తోంది. పరిస్థితి ఇంత దారుణంగా మారింది కాబట్టి, రైతులు తమ స్థానాన్ని నిలుపుకోవడానికి చెప్పులు పెట్టి క్యూలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పులే క్యూలు సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో యూరియా కోసం చెప్పులు లైన్ కట్టయి ప్రభుత్వం భూ కార్డు ఆధారంగా ఎకరానికి ఒక యూరియా బస్తా కేటాయించింది. కానీ ఇది రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. పంటలకు కావలసినంత ఎరువు అందకపోవడంతో పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“బస్తా కోసం రోజు మొత్తం లైన్లో ఉండాలి, లేదంటే మా వంతు రాదు. చెప్పులు పెట్టి లైన్ వేసుకోవడం తప్ప వేరే దారి లేదు” అని రైతులు వాపోతున్నారు. యూరియా పంపిణీలో వేలిముద్ర తప్పనిసరి చేశారు. వేలిముద్ర సరిపోకపోతే రైతులకు బస్తా ఇవ్వడం లేదు. దీంతో కొంతమంది రైతులు బస్తా తీసుకోలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.
పోలీసుల ఫైన్ – రైతుల అసహనం:
ఒక వైపు ఎరువు కోసం రైతులు లైన్లలో నిలబడుతుంటే, మరోవైపు పోలీసులు ద్విచక్ర వాహనాలకు ఫైన్‌లు వేస్తుండటం రైతులను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. “యూరియా బస్తా కోసం పోరాడితే జరిమానా, ఇది ఏ న్యాయం?” అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో లేని కొరత – ఇప్పుడు ఎందుకు?
గత పాలనల్లో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు రైతుల నోళ్లలో వినిపిస్తున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపమా? అనే సందేహాలు కలుగుతున్నాయి. “అన్నం పెట్టే రైతు చెప్పుల క్యూలు వేసి ఎరువు కోసం వేచి ఉండటం రైతు గౌరవానికి తగినది కాదు” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత కేవలం ఒక ఎరువు సమస్య కాదు.. ఇది రైతు జీవనాధారం సమస్య. రైతు బతికితేనే దేశం బతుకుతుందన్న సత్యాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు


