కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే ఎవరినీ ఉపేక్షించబోమనే సంకల్పంతో పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తెలిపారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత వ్యవహారాలు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నాయని, ఆ పరిస్థితిని గుర్తించిన కేసీఆర్ నిర్ణయం సమయోచితమని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇల్లు, 60 లక్షల మంది సైనికుల సైన్యం అని, కేసీఆర్ ఎప్పటినుంచో చెప్పిన మాటే, తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా ఉపేక్షించేది లేదని అన్నారు. కన్నకూతురు కన్నా పార్టీ కార్యకర్తల భవిష్యత్తు ముఖ్యమని నిరూపించిన ఈ నిర్ణయం ప్రశంస నీయమైనదని, పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కారనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన కేసీఆర్, ఇప్పుడు పార్టీ కోసం తన కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. ఈ నిర్ణయంతో పార్టీ బలోపేతం అవుతుందని నమ్మకాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విప్ వివేకానంద్ వ్యక్తం చేశారు.


