*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పరిశ్రమల తోడ్పాటు కీలకం..
*సిమెంటు, స్టీల్ కంపెనీలు భాగస్వాములు కావాలి..
*ధరల్లో తగ్గింపు చేసి, నాణ్యతతో సరఫరా చేయాలి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయ కోణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావడానికి సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఆయన, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిమెంటు, స్టీలు పరిశ్రమల యజమానులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతోందని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వేగంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 27.75 లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు అవసరమని అధికారులు వివరించారు. పేద కుటుంబాలకు కేటాయించిన ఈ పథకానికి ధరల్లో తగ్గింపు చేసి, నాణ్యతతో కూడిన సిమెంటు, స్టీల్ సరఫరా చేయాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని కంపెనీలు ఒకే ధరకు సరఫరా చేయాలని సూచించారు. తెలంగాణలో పరిశ్రమలకు ప్రభుత్వం విస్తృత ప్రోత్సాహం అందిస్తోందని, భవిష్యత్తులో సిమెంటు, స్టీల్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు అందిస్తున్న ధరలను కూడా సమీక్షించినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తోడ్పాటు అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలోనే ధరలను ఖరారు చేయడానికి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సమావేశమవుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు


