కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ప్రత్యేక విభాగమైన కోబ్రా స్కూల్ ఆఫ్ జంగిల్ వార్‌ఫేర్ అండ్ టాక్టిక్స్ (సి ఎస్ జే డబ్ల్యూ టి ) కేంద్రంలో నూతనంగా నిర్మించిన ట్రైనింగ్, ఏవీ హాల్ బిల్డింగ్, సబ్ ఆర్డినేట్ ఆఫీసర్స్ మెస్ భవనం, 180 మంది జవాన్లకు బ్యారక్ (సైనిక నివాసాలు)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బెలగావ్ సౌత్ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ ఇంచార్జీ అభయ్ పాటిల్, ఎమ్మెల్యే విఠల్ హళగేకర్, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ ఏడీజీ రవీదీప్ సాహి, కె.కె. సెక్టార్ ఐజీ డా. విపుల్ కుమార్, డీఐజీ సుభాష్ చంద్రతోపాటు జిల్లా కలెక్టర్, సీఈవో, డీఎఫ్ఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎర్పీఎఫ్ సేవ, నిబద్ధతకు కేంద్ర మంత్రి ప్రశంస..
నిష్పాక్షికత, జాతీయత, సేవ, నిబద్ధతలకు ప్రతీకగా సీఆర్పీఎఫ్ నిలుస్తుందని బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగినా సీఆర్పీఎఫ్ బలగాలు లేకుండా నిర్వహించడం అసాధ్యమని, ఏ రాష్ట్రానికి కేంద్ర బలగాల అవసరం వచ్చినప్పుడు తొలుత సీఆర్పీఎఫ్ బలగాలను మాత్రమే కోరుతారని చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అనుకుంటే అందులో సీఆర్పీఎఫ్ పాత్ర మరవలేనిదని అన్నారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాలు గణనీయంగా తగ్గాయని, ఇందులో సీఆర్పీఎఫ్ ప్రత్యేక విభాగమైన కోబ్రా దళం పాత్ర ప్రశంసనీమని అన్నారు. కోబ్రా దళం సహా ఇతర బలగాల ద్వారా నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి గాలి వీస్తోందని చెప్పారు. నక్సలిజం పూర్తిగా అంతరించే రోజులు దూరంలో లేవని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శనంలో వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు.
కోబ్రా స్కూల్ నూతన భవనాల వివరాలు..
రూ.36 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలలో ఆధునిక ట్రైనింగ్, ఏవీ హాల్, సబ్ ఆర్డినేట్ ఆఫీసర్స్ మెస్, 180 మంది జవాన్లకు బ్యారక్‌లు ఉన్నాయి. ఇందులో ఆధునిక ఆడిటోరియం, సెమినార్ హాల్, తరగతి గదులు, ఆడియో, విజువల్ గది, శాండ్ మోడల్ రూమ్, ఐఈడీ మోడల్ రూమ్, ఇతర శిక్షణా సంబంధిత సదుపాయాలు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. జవాన్లకు ఎప్పటికప్పుడు ఆధునిక శిక్షణ, సదుపాయాలు అందించడం అత్యంత ముఖ్యమని, దేశ సేవకు త్యాగం చేసే సైనికుల సంక్షేమం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సీఎర్పీఎఫ్, కోబ్రా దళం వంటి ప్రత్యేక బలగాలు దేశ భద్రతలో వెన్నెముకగా నిలిచేలా కృషి చేస్తోందని బండి సంజయ్ అన్నారు. నేషన్ ఫస్ట్ అనే మంత్రాన్ని గుండెల్లో పెట్టుకుని దేశ సేవ చేయాలని జవాన్లకు సూచించారు.


