ఎమ్మెల్యే సార్.. జరదేఖో..!
జీడబ్ల్యూఎంసీ 54వ డివిజన్లో సమస్యల తాండవం
తాగునీటికి అల్లాడుతున్న ప్రజలు
45రోజులుగా నీటి సరఫరా బంద్
విన్నవించినా ఆలకించని అధికారులు
సమస్యలను పరిష్కరించాలని రోడ్డెక్కిన జనం
తాగునీటి సమస్యతో పాటు డివిజన్‌లో మురుగు కంపు
పారిశుధ్యంతో పెరుగుతున్న దొమల సమస్య
జ్వరాల బారిన పడుతున్న 54 వ డివిజన్‌లోని పలు కాలనీలు
ఇదేం పరిపాలన అంటూ జనంలో అసంతృప్తి
అధికారులు ఏం చేస్తున్నట్లు..ఎమ్మెల్యే ఏం చూస్తున్నట్లు అంటూ ఆగ్రహం
కాకతీయ, హనుమకొండ : జీడబ్ల్యూఎంసీ 54వ డివిజన్‌లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. గత 45 రోజులుగా డబ్బాల ఏరియాలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. తాగు, వినియోగం నీటి కోసం బోర్లు, ట్యాంకర్లపై ఆధార పడుతున్నారు. కాలనీల ప్రజలు ట్యాంకర్లు తెప్పించుకునేందుకు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకొకరి చొప్పున వాటర్ ట్యాంకులను తెప్పించుకుంటుండటంతో ఆర్థిక భారం పడుతోందని అంటున్నారు. గ్రేటర్ వరంగల్‌కు నీటి పన్ను చెల్లిస్తున్నా.. తమ సమస్యను పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు. కాలనీలోని పలు బోర్లు కూడా పనిచేయకపోవడంతో సమస్యను మరింత జఠిలం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని సార్ మా సమస్యలను జర దేఖో అంటూ డివిజన్ ప్రజలు కోరుతున్నారు.


కాలనీల్లో మురుగు కంపు..
ఓ వైపు నీటి సమస్య వేధిస్తుండగా… మరోవైపు కాలనీల్లో మురుగు, పారిశుధ్య లోపంతో దొమల స్వైరవిహారం పెరుగుతోంది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవంతో గుట్టలుగా కనిపిస్తోంది. డ్రైనేజీలను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో రోడ్లపైకి పారుతోంది.కాలనీల్లో దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని కాలనీవాసులు మండిపడుతున్నారు.చెత్త పన్ను వసూలులో అధికారులు చూపుతున్న శ్రద్ధ.. సేవలందించడంలో ఎందుకు చేయరంటూ మండిపడుతున్నారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోతున్నా.. శానిటేషన్ అధికారులు దృష్టి సారించడం లేదని అంటున్నారు. దీంతో దొమల వ్యాప్తి అధికమవుతుండటంతో డెంగ్యూ, వైరల్ జ్వరాల బారినపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కుక్కల బెడద కూడా డివిజన్‌లో ఎక్కువ కావడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

అధికారలు ఏం చేస్తున్నట్లు…! : పేరం గోపికృష్ణ, బీజేపీ నాయకుడు
54వ డివిజన్‌లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో నీటి అవసరాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సమ్మర్‌కు యాక్షన్ ప్లాన్‌తో ఉండాల్సిన అధికారులు.. ఏమాత్రం పట్టింపులేని విధంగా ఉంటున్నారు. అనేక సార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దోమల బెడద విపరీతంగా ఉంది. పారిశుధ్య సమస్యతో దోమలు పెరుగుతున్నాయి. ఎండాకాలంలో నీటి అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్‌లో సమస్యల పరిష్కరానికి ఎమ్మెల్య చొరవ చూపాలి. లేదంటే ప్రజలతో కలిసి ఆందోళనలను ఉధృతం చేస్తాం.



