పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఇప్ప పువ్వు , తేనె సేకరణతో మహిళా సంఘాలకు ఉపాధి
అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు
అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
కాకతీయ, ఏటూరునాగారం : పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, ఇప్ప పువ్వు, తేనె సేకరణ ద్వారా మహిళా సంఘాలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి గృహ స్వప్నాన్ని సాకారం చేస్తున్నామని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. శుక్రవారం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నారం గ్రామంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.15 లక్షల సీఆర్‌ఆర్ నిధులతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అంకంపల్లి గ్రామంలో ఐటిడిఎ నిధులతో సుమారు రూ.83 లక్షల వ్యయంతో ఆర్ అండ్ బి రహదారి నుండి గ్రామం వరకు నిర్మించనున్న బీటీ రహదారికి పునాది వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆమె పేర్కొన్నారు. అదే కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలను నిర్వహించి, పలువురికి ఇళ్ల మంజూరు పట్టాలను పంపిణీ చేశారు. గూడు లేని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో ములుగు నియోజకవర్గానికి 5 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
త్వరలోనే అర్హులైన వారికి రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, పౌష్టికాహారం సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. మెనూ అమలు పట్ల కచ్చితమైన పర్యవేక్షణ అవసరమని సూచించారు. అంకంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో రహదారి సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆర్ అండ్ బి రోడ్డు నుండి గ్రామం వరకు బీటీ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ఇప్ప పువ్వు, తేనె సేకరణ వంటి స్థానిక వనరులను ప్రోత్సహించడం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పంచాయతీరాజ్ టీఈ అజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


