ఎట్టకేలకు ఖాకీలకు చిక్కాడు
పద్నాలుగేళ్లుగా పరారీలో నిందితుడు
భార్య, ఇద్దరు చిన్నారుల మృతికేసులో చేధన
వివరాలు వెల్లడించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
కాకతీయ, సిరిసిల్ల : భార్య, ఇద్దరు చిన్నారుల మృతికేసులో 14 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సాంకేతిక ఆధారాలతో కదలికలను గమనించి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు 2007లో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి శ్రీనిధి, నైపున్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2012లో భాగ్యలక్ష్మి గర్భవతిగా ఉన్న సమయంలో మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వేధింపులను తట్టుకోలేక భాగ్యలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. అదే ఏడాది కేసు నమోదైంది.
కేసు నమోదైన తర్వాత నుంచి ఆంజనేయులు పరారీలో ఉన్నాడు. న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇటీవల బాధితురాలి తల్లి ఎల్లవ్వ పోలీసులను ఆశ్రయించడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో కదలికలను గుర్తించి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కేవలం మూడు రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్, ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్, సిబ్బంది కీలక పాత్ర పోషించారు. వారి పనితీరును ఎస్పీ అభినందించారు. బాధితురాలి తల్లి ఎల్లవ్వ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


