కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ మధుసూదన్ రెడ్డి
దీక్షలో ఉన్న కార్మికులకు సంఘీభావం
కాకతీయ, మణుగూరు: ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత 16 రోజులుగా కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఐటీసీ, పీఎస్పీడీ పేరుతో పంచ్ కార్డు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులు, ప్లాంటేషన్ కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలకు అదనంగా 500 చెల్లించి ఆ మొత్తాన్ని బేసిక్‌లో కలపాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు మొత్తం వేతనంపై ఎటువంటి సీలింగ్ లేకుండా 20% బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సి 4ఎల్, బి 1ఎల్ గ్రేడ్‌లను వెంటనే రద్దు చేయాలని కోరారు. విఆర్ఎస్ స్కీంను అమలు చేయాలని తెలిపారు. ఫైనల్ సెటిల్మెంట్‌ను పునరుద్ధరించాలని, సీనియార్టీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు 26 డ్యూటీలు ఇస్తూ వీక్లీ ఆఫ్‌లకు కూడా వేతనం చెల్లించాలని అన్నారు. ప్లాంటేషన్ కార్మికులకు రవాణా సౌకర్యం, డిస్పెన్సరీ, అంబులెన్స్, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాలనీ మెయింటెనెన్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పంచ్ కార్డు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి సాయి మరియు కార్మికులు పాల్గొన్నారు.


