డీజీపీ ఎదుట మావోయిస్టుల సరెండర్
45మంది మావోయిస్టుల లొంగుబాటు
పీఎల్జీఏ బెటాలియన్‌కు భారీ దెబ్బ
కీలక కమాండర్లు సహా లొంగుబాటు
36 తుపాకులు, 1007 తూటాలు, 800 గ్రాముల బంగారం స్వాధీనం
నిరంతర ఆపరేషన్ల ఫలితమే ఈ పరిణామం
పునరావాస ప్యాకేజీలతో ప్రభుత్వం ముందకు : డీజీపీ శివధర్‌రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ కాలంగా అరణ్యాల్లో సాయుధ పోరాటం కొనసాగిస్తున్న సిపిఐ (మావోయిస్టు)కు చెందిన 42 మంది కేడర్లు తెలంగాణ పోలీసుల ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ ఘటనను భద్రతా వ్యవస్థలో కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. లొంగిన వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ సోడి మల్ల @ కేశాల @ నిఖిల్, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు చాప నారాయణ @ గజేందర్ @ మధు, కడిరన్ను @ మంతు వంటి కీలక నాయకులతో పాటు ఇతర కేడర్లు కూడా ఉన్నారు. వీరంతా గత కొన్నేళ్లుగా వివిధ అరణ్య ప్రాంతాల్లో సాయుధ కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు సవాలు విసిరిన వారేనని అధికారులు తెలిపారు. లొంగుబాటు సమయంలో కేడర్లు తమ వద్ద ఉన్న భారీ ఆయుధ సామగ్రిని కూడా అప్పగించారు. మొత్తం 36 తుపాకులు, 1007 తూటాలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, 800 గ్రాముల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన ఆయుధాల్లో ఐదు ఏకే-47 రైఫిళ్లు, నాలుగు ఎస్ఎల్ఆర్‌లు, మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఆరు .303 రైఫిళ్లు, ఒక స్టెన్ గన్, పది సింగిల్ షాట్ గన్స్, రెండు రివాల్వర్లు, ఒక బీజీఎల్ గన్ ఉన్నాయి.

కీలక నాయకత్వం కూలింది
లొంగుబాటులో కీలక నాయకులు ఉండటం మావోయిస్టు సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. ముఖ్యంగా సోడి మల్ల @ కేశాల @ నిఖిల్ పీఎల్జీఏ బెటాలియన్ కార్యకలాపాలను నడిపించిన వ్యక్తిగా గుర్తింపు పొందినవాడు. అలాగే చాప నారాయణ @ గజేందర్ @ మధు తెలంగాణ రాష్ట్ర కమిటీకి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా వ్యవహరించినట్లు సమాచారం. కడిరన్ను @ మంతు కూడా సాయుధ దళాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ముగ్గురు సహా ఇతర కేడర్లు లొంగిపోవడంతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ దాదాపు నిర్వీర్యమైందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ స్థాయిలో కూడా కార్యకలాపాలు క్షీణించినట్లు తెలుస్తోంది.

నిరంతర ఆపరేషన్ల ఫలితమే ఈ పరిణామం : డీజీపీ శివధర్‌రెడ్డి
ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ, “గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న వ్యూహాత్మక ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యల వల్లే ఈ భారీ లొంగుబాటు సాధ్యమైంది. మావోయిస్టు కేడర్‌లో భయం పెరిగింది. అభివృద్ధి, పునరావాస అవకాశాలు చూసి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు” అని పేర్కొన్నారు. “మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తోంది. లొంగుబాటు చేసుకునే వారికి ప్రభుత్వం పూర్తి భద్రత, పునరావాసం కల్పిస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2024 నుంచి 2026 వరకు మొత్తం 761 మంది మావోయిస్టు కేడర్లు లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. అదే కాలంలో 302 తుపాకులు స్వాధీనం చేసుకోవడం పోలీసుల ఆపరేషన్ల తీవ్రతను సూచిస్తోందన్నారు. లొంగుబాటు చేసిన కేడర్లను ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. కమిటీ స్థాయిని బట్టి రూ.1 లక్ష నుంచి రూ.20 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. ఆయుధాలతో లొంగిన వారికి అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు. మొత్తం రూ.1.93 కోట్ల ప్యాకేజీ కేడర్లకు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి పథకాలు, విద్యా సదుపాయాలు కూడా కల్పిస్తామని తెలిపారు.



