అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ
పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందుబాటులో
యువతలో అవగాహన పెంపుపై దృష్టి సారించాలి
గర్భిణీలకు ప్రత్యేక పరీక్షలు, నివారణ చర్యలు
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాకతీయ, వరంగల్ : ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరికి సమగ్ర అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు ఎయిడ్స్ అవగాహన, నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కళాశాల (కెఎంసి) నుండి ఎంజీఎం ఆసుపత్రి కూడలి వరకు నిర్వహించిన రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ఆశాలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని “ఎయిడ్స్ నివారణ” నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ అనంతరం ఎంజీఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిడ్స్‌పై సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్త మార్పిడి, కలుషిత సూదులు, సిరంజీల వినియోగం ద్వారా వ్యాధి వ్యాపించే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సురక్షిత పద్ధతులను అనుసరించడం, అవసరమైన సందర్భాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, బాధితులు ఎలాంటి భయం లేకుండా వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
పరీక్షలు–చికిత్సలు అందుబాటులో
వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు నిర్వహిస్తూ, తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా నివారణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎయిడ్స్ నిర్ధారణ అయిన వెంటనే ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచిత చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా మానవతా దృక్పథంతో సహకరించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామ, పట్టణ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో, పట్టణాల్లో ఎయిడ్స్ నివారణపై కళాజాతలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు వీటిలో పాల్గొని సరైన సమాచారం తెలుసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు కోరారు. ఈ సందర్భంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్మికుల కోసం నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్‌ను కలెక్టర్ ప్రారంభించి వైద్య పరీక్షలను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వైద్య గణేష్, సంధ్యారాణి, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీఓలు, ప్రజలు పాల్గొన్నారు.


