హస్పుఖాన్ భవనం కూల్చివేత
రాయిగూడెం గ్రామంలో కూల్చివేతపై ముస్లింల ఆగ్రహం
కాకతీయ, కూసుమంచి : హస్పుఖాన్ భవనం కూల్చివేతతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారు. నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో ముస్లింలకు చెందిన చారిత్రక హస్పుఖాన్ భవనాన్ని గురువారం కూల్చివేశారు. ఈ ఘటనపై స్థానిక ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 100 సంవత్సరాలుగా ముస్లింలకు చెందిన ఈ భవనం అప్పట్లో నవాబ్ వారు గ్రామానికి చెందిన ఎస్ కే ఖాన్ మహమ్మద్ తండ్రి జనుల్ మహమ్మద్ ను వక్ఫ్ బోర్డు ద్వారా ముతవల్లిగా నియమించడంతో వారి ఆధీనంలో కొనసాగుతూ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కూడా వారి వారసులు గ్రామంలో నివసిస్తున్నారని, అయితే సంబంధిత వారసులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ భవనాన్ని కూల్చివేయడం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కూల్చివేతలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వారి అనుచరులు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమ కూల్చివేతపై ఆగ్రహం
ఈ ఘటన ముస్లిం సోదరుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ముస్లిం పెద్దలు ప్రభుత్వం, అధికారులను కోరుతున్నారు. లేకపోతే ఈ విషయం పెద్ద స్థాయిలో వివాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


