ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
ప్రజా సమస్యలపై పోరాటాలు వేగవంతం చేయాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
కాకతీయ, కరీంనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర పోరాటాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజా అనుకూల చట్టాల బదులు కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు.
ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం, నిధులు తగ్గించడం, కూలీలకు వేతనాలు ఆలస్యం చేయడం ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు. పనిదినాలు, కూలి పెంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, విద్యుత్ సంస్కరణ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయకపోవడం మోసం అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లతో దోపిడీ పెంచారని, నిరుద్యోగం పెరిగినా ఉద్యోగాల భర్తీ జరగడం లేదన్నారు. మత రాజకీయాలతో ప్రజా సమస్యలను మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక సంక్షోభంపై కేంద్రం మౌనం వీడాలని, పరిస్థితిని ఎదుర్కొనేందులో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రైతులు, కూలీలు, మహిళలు, యువతకు ప్రకటించిన పథకాలు అమలు కాలేదన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


