పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!
ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే కేసులా..?
తప్పుడు కేసులతో వేధింపులు.. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నేతల ఆగ్రహం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పోటు రంగారావుపై కేంద్ర ప్రభుత్వం, ఎన్ఐఏ నమోదు చేసిన దేశద్రోహం, ఇతర కుట్ర కేసులను వెంటనే ఎత్తివేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మంలో రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కేంద్ర కమిటీ నాయకులు కేజీ రామచందర్, కే రమ, కే రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అణచివేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం కేసులను బనాయిస్తోందని వారు ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు నేతలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.
ప్రజా ఉద్యమాలను అణచివేత ప్రయత్నమా..?
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చట్టబద్ధంగా బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతోందని, అలాంటి పార్టీపై కుట్ర కేసులు నమోదు చేయడం అన్యాయమని నాయకులు పేర్కొన్నారు. ప్రజలను చైతన్య పరుస్తున్నందుకే పాలకవర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా, ఉమర్ ఖలీదు వంటి పలువురిపై కూడా ఇలాంటి కేసులు పెట్టి తర్వాత ఉపసంహరించుకున్న ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలి
పోటు రంగారావు దాదాపు యాభై ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారని, అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న వారిని అణచివేయాలనే ప్రయత్నంగా ఈ కేసులను చూస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశద్రోహం, ఇతర కేసులను ఉపసంహరించుకోవాలని, లేకపోతే పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఈ ప్రెస్ మీట్ లో పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే సూర్యం ఎస్ఎల్ పద్మ, సదానందం ఎం కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులుగుర్రం అచ్చయ్య, సీ వై పుల్లయ్య, ఆవుల అశోక్, జిరామయ్య, పార్టీ జిల్లా నాయకులు మలీదు నాగేశ్వరరావు, కమ్మ కోమటి నాగేశ్వరరావు,టి ఝాన్సీ, ఎన్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.


