17న హిందూ మహాసమ్మేళనం
హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మిర్యాల నరసింహారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : హిందూ సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా గిద్దె పెరుమాండ్ల మహా హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మిర్యాల నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 17న కోతి రాంపూర్ గిద్దె పెరుమాండ్ల దేవాలయం ఆవరణలో సమ్మేళనం జరగనుంది. బుధవారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఆవిష్కరణకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు కోరారు. అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ సమాజంలో కులాల పేరుతో విభజన పెరుగుతున్న నేపథ్యంలో హిందువులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ భావం పెంపొందించుకోవాలని సూచించారు. విదేశీ ప్రభావాలను ఎదుర్కొనేందుకు సమాజంలో ఐక్యత అత్యంత అవసరమని తెలిపారు. కోతి రాంపూర్, కట్టరాంపూర్, పోచమ్మవాడ, అల్కాపూర్ కాలనీ ప్రాంతాల నుంచి హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బస్తీ ప్రముఖులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


