అమ్మ.. నాయినో!
ఎంజీఎంపై ఎంత కాలానికి స్పందన ?
ఆస్పత్రిని సందర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే ..
వైద్యులు, సిబ్బందికి సూచనలు
అసౌకర్యాలపై నోరుమెదపని ప్రజాప్రతినిధి
అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా పట్టించుకోని కలెక్టర్ !
ఒక్క సమీక్ష నిర్వహించని జిల్లా అధికారి ?
ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు స్పందించని దౌర్భాగ్యం
ఆరోగ్యశాఖ మంత్రి ఒక్కసారి కూడా వరంగల్ కు రాని వైనం
ఒక్క ఎమ్మెల్యే చెబితే ఎంజీఎం మారిపోతుందా?
అక్రమాలు ఆగిపోతాయా? విధుల్లో నిర్లక్ష్యం వీడుతుందా?
ఎంజీఎం దుస్థితిపై రోగుల్లో ఆందోళన
ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై అసహనం
కాకతీయ, వరంగల్: వరంగల్ నగరంలోని ఎంజీఎం దవాఖాన.. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు అని చెబుతుంటారు. అయితే.. పైన పటారం… లోన లొటారం… అన్నట్లుగా ఉంది ఆస్పత్రి పరిస్థితి. ఎవరి దందా వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేవలం తమ వేతనాలు వస్తే సరిపోతుందన్నట్లుగా పైస్థాయి వైద్యుల నుంచి కిందిస్థాయి వాచ్ మన్ వరకు విధులు నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. డాక్టర్ ఉంటే మందులు ఉండవు. రెండు ఉంటే వసతులు ఉండవు. కొంతకాలంగా ఆస్పత్రిలో వైద్యులు, వసతులు కూడా అందుబాటులో లేకుండా పోయాయని రోగులు, జనం గగ్గోలు పెడుతున్నారు. అయినా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎవరూ ఆస్పత్రి దుస్థితిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఏడెనిమిది నెలల నుంచి ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్న పరిణామాలను మీడియా కళ్లకు కట్టినట్లు బహిర్గతం చేస్తున్నా… ఏ ఒక్కరూ స్పందించిన పరిస్థితులు లేవు. చివరకు ఒకే ఒక్క ఎమ్మెల్యే.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అడ్డిమారి గుడ్డిగా వెళ్లారో? నిజంగానే వెళ్లారో గానీ మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు.

అడుగడుగునా నిర్లక్ష్యం, అక్రమాలు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఏడెనిమిది నెలలుగా మరింతగా పెరిగిపోయినట్లు రోగులు, వారి బంధువులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పలు విభాగాల్లో అక్రమాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. వైద్యులు సమయానికి విధులకు రావడం లేదని, వచ్చినా పది, పదిహేను నిమిషాలకంటే ఎక్కువ సేపు ఉండడం లేదని రోగులు వాపోతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన వసతులు లేవని రోగులు ఆందోళన చెందుతున్నారు. కనీసం రక్త నిల్వలు కూడా లేకపోవడం రోగులను అయోమయానికి గురిచేస్తోంది. కొన్ని రకాల పరీక్షలు బయట డయాగ్నసిస్ సెంటర్లలో చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదని తెలుస్తోంది. కొందరు వైద్యాధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకరిద్దరు తమ డ్యూటీని పక్కన పెట్టి ఇతర పనుల్లో బిజీగా మారుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఒక ఉద్యోగి అయితే, మూడు దశాబ్దాలుగా ఇదే ఆస్పత్రిలో పని చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. సెక్యూరిటీ విభాగంలోనూ భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. రికార్డుల్లో ఎక్కువ సంఖ్యలో సెక్యూరిటీని చూపించి.. కొంతమందితోనే పనులు చేయిస్తూ… ఏటా కోట్ల రూపాయలు నొక్కేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వార్డుల్లో కొందరు నర్సులు రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. స్ట్రెచర్, వీల్చైర్లకు కూడా వార్డు బాయ్ లు మామూళ్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవి కూడా అరకొరగానే ఉన్నట్లు సమాచారం. ఇన్ని సమస్యల్లో చిక్కుకున్న ఆస్పత్రిని మెరుగుపరచడంలో ప్రభుత్వం గానీ, ప్రతినిధులు గానీ ఇప్పటివరకు ఒక్క చర్య తీసుకున్న దాఖలాలు లేవు.

ఎట్టకేలకు వచ్చిన ఎమ్మెల్యే!
ఏడెనిమిది నెలలుగా ఆస్పత్రి దుస్థితిపై మీడియాలో కథనాలు వస్తున్నా ఏ ఒక్క ప్రజాప్రతినిధి స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది. చాలాకాలం తర్వాత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఒక్కరే మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. అందరూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. మందుల కోసం టెండర్ వేయాలని సూచించారు. అంతకుముందు కొన్ని నెలల క్రితం వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఎంజీఎంను సందర్శించి ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితులు మారకపోగా.. మరింత దారుణంగా తయారయ్యాయి. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సైతం ఆస్పత్రిని పలుమార్లు సందర్శించారు. కొందరు వైద్యులకు మెమోలు జారీ చేశారు. ఆ తర్వాత ఆస్పత్రిలో పరిస్థితులు అలాగే ఉండడం కాదు … మరింత దుర్భరంగా మారాయి. వాస్తవానికి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా కలెక్టర్ వ్యవహరిస్తుంటారని సమాచారం. కానీ, కలెక్టర్ ఆస్పత్రి అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితులు బయటకు మాత్రం కనిపించడం లేదు. ఆస్పత్రి నిర్వహణపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నా.. గడిచిన ఏడెనిమిది నెలల్లో కలెక్టర్ ఒక్కసారి కూడా ఆస్పత్రిని సందర్శించినట్లు కనీస సమాచారం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్క ఎమ్మెల్యే వచ్చి.. విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశిస్తే.. ఉన్నపళంగా వైద్యులు మారిపోతారా? ఆస్పత్రిలో అసౌకర్యాలు తొలగిపోతాయా? అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా? అని రోగులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు.


