డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
లేదంటే బీజేపీ తడాఖా చూపిస్తాం
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మంగళవారం నిరాహార దీక్ష విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ ప్రాంతంలో ఈ నిర్ణయం ఉద్రిక్తతలకు దారితీసిందని విమర్శించారు. ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం తగదన్నారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల గాలి, నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


