అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు
జనసేన నేత బేతి మహేందర్ రెడ్డి విమర్శలు
కాకతీయ, కరీంనగర్ : డివిజన్ల మ్యాపింగ్ పేరుతో చేపడుతున్న ఓటరు సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నాయని, దీనికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమేనని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి విమర్శించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓలు) గడప గడపకు తిరిగి ఓటర్ల వివరాలు సరిచూడాల్సి ఉండగా, స్థానిక కార్పొరేటర్ల ప్రభావంలో ఒకే చోట కూర్చుని మ్యాపింగ్ నిర్వహిస్తూ తప్పుడు నివేదికలు సిద్ధం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విధమైన నిర్లక్ష్య ధోరణి కారణంగానే డివిజన్లలో ఓట్ల గల్లంతు జరుగుతోందని పేర్కొన్నారు.ఓటరు జాబితాలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ, బతికున్న వారి ఓట్లు తొలగించడం, మరణించిన వారి పేర్లు యథాతథంగా కొనసాగించడం వంటి తీవ్రమైన తప్పిదాలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఒకే ఇంటికి చెందిన ఓట్లు వేర్వేరు డివిజన్లలో నమోదు కావడం, ఇతర ప్రాంతాల ఓట్లు చొరబడటం, డబుల్ ఓట్లు నమోదవడం, ఓటరు పేరు ఒకటి,ఫోటో మరొకటి ఉండటం వంటి అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. ఈ పరిస్థితులు ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెంచుతున్నాయని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ముందు ఈ అంశాలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోలేదని, ఫలితంగా పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బి.ఎల్.ఓలతో పాటు వారిపై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కూడా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల సమస్యలను అరికట్టేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియను కఠినంగా అమలు చేయాలని బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా మాత్రమే ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో రాష్ట్రంలో (ఎస్ ఐ ఆర్) అమలుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.


