మల్లెపచ్చం వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు?
500 ఎకరాల వ్యవసాయ భూములకు రాకపోకల సమస్య
ఏళ్లుగా ఎదురుచూపులు.. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు
ఎన్నికల వాగ్దానంగా మిగులుతున్న బ్రిడ్జి నిర్మాణం
కాకతీయ,శంకరపట్నం : మండలంలోని కేశవపట్నం గ్రామ పరిధిలో ప్రవహిస్తున్న మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానిక రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్న నాయకులు, తర్వాత మాత్రం సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మల్లెపచ్చం వాగు అవతల వైపున దాదాపు 500 ఎకరాలకు పైగా సస్యశ్యామల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములకు చేరుకోవాలంటే తప్పనిసరిగా వాగును దాటాల్సిందే. అయితే వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రైతులు తమ పొలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు ఆలస్యం కావడం, కోతల సమయంలో నష్టం కలగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
వర్షాల్లో నరకయాతన..
ప్రతి వర్షాకాలంలో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాగు దాటడం ప్రమాదకరంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్రామస్తులు సైదాపూర్ రోడ్డుమార్గం ద్వారా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో సమయం వృథా కావడమే కాకుండా, ఆటోలు అద్దెకు తీసుకోవాల్సి రావడంతో అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని మహిళలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.
వాగ్దానాలకే పరిమితమైన నాయకులు..
ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మాణంపై హామీలు ఇచ్చినా, వాటి అమలు మాత్రం జరగలేదని ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో కమలాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిశీలించినప్పటికీ, శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని గ్రామస్తులు గుర్తుచేశారు. పలుమార్లు అధికారులు కూడా పరిశీలించినా, పనులు మాత్రం ప్రారంభం కాలేదని అంటున్నారు.
సాంక్షన్ అయినా పనులు ఎందుకు నిలిచాయి?
టీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని సమాచారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిధుల కొరతనా? లేక పరిపాలనా నిర్లక్ష్యమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుత మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కప్పంపల్లి సత్యనారాయణ స్పందించి వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులభమవడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు వేగవంతం అవుతాయని, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్పటికైనా ప్రభుత్వం స్పందించి మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణాన్ని తక్షణం ప్రారంభిస్తుందా? లేక మరోసారి హామీలకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.


