ఆహార భద్రతలో రాజీ పడొద్దు
నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం
గడువు తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలి
జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి
కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజలు ఆహార భద్రత విషయంలో రాజీ పడకుండా నాణ్యమైన ఆహారం తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి సూచించారు. గడువు తీరిన ఆహార పదార్థాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల్లో ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. ఆహార ముడి పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో గడువు తేదీ, తయారీ తేదీ తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే భోజనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. తాజా కూరగాయలను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ హౌస్ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని తెలిపారు. పరిశుభ్రతపై రాజీ పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ వేణుగోపాలరావు, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ జోనల్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ డిడి జనార్ధన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


