ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
హన్మకొండ కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష
జిల్లాలో 75 శాతం పూర్తైన ఎస్ఐఆర్ మ్యాపింగ్
కాకతీయ, హనుమకొండ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన బీహార్ అదనపు సీఈవో ప్రశాంత్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎస్ ఐ ఆర్ మ్యాపింగ్ పురోగతిపై సమీక్షించారు. ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మ్యాపింగ్ శాతం తక్కువగా ఉండటంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో మ్యాపింగ్ వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. అధికారులతో మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి మున్సిపల్ సిబ్బంది, బూత్ లెవెల్ అధికారులు (బి ఎల్ ఓ లు) సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ల (బి ఎల్ ఏ లు) జాబితాను రాజకీయ పార్టీల నుంచి సమర్పింపజేయాలని, బి ఎల్ ఓ లతో పాటు బి ఎల్ ఏ లు కూడా మ్యాపింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, రేషన్ డీలర్ల సహకారాన్ని వినియోగించుకోవాలని, ఫిజికల్ ఎన్యుమరేషన్ ఫార్ముల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎస్ ఐ ఆర్ మ్యాపింగ్ 75 శాతం పూర్తయిందని తెలిపారు. సమావేశానికి ముందు కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న సుదర్శన్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, జిల్లా కలెక్టర్ మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ఎదురైన సవాళ్లు, వాటి పరిష్కారాలపై ప్రశాంత్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, ఏసీపీ నరసింహరావు, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


