జీపీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
సర్పంచ్ భర్త జోక్యంపై గ్రామంలో ఆగ్రహం
మాజీ సర్పంచ్ బొంపెల్లి రాజేశ్వరరావు
కాకతీయ, నెక్కొండ : అధికారిక హోదా లేకపోయినా సర్పంచ్ భర్త పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని మాజీ సర్పంచ్ బొంపెల్లి రాజేశ్వరరావు ఆరోపించారు. పంచాయతీ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై వివాదం రేగింది. సర్పంచ్ భర్త శివకుమార్ పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ ఇంచార్జ్ ఎంపీడీఓ దయాకర్‌కు వినతిపత్రం సమర్పించారు.
కేంద్ర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి మాజీ సర్పంచ్‌లకు రావలసిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. పంచాయతీ ఖాతాల నుంచి నగదు డ్రా చేసి ఖర్చులు చూపుతున్నారని ఆరోపించారు. గత మూడున్నరేళ్లలో 18 లక్షలు ఖర్చు చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదని తెలిపారు. ఫాగింగ్ యంత్రం కొనుగోలులో కూడా వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. 40 వేల విలువ గల యంత్రాన్ని 74 వేలుగా చూపించారని తెలిపారు. ఫాగింగ్ పనులకు 15 వేలు చూపినట్లు పేర్కొన్నారు. ఇంధన ఖర్చుల పేరుతో కూడా అధికంగా నమోదు చేసినట్లు ఆరోపించారు. ట్రాక్టర్ మరమ్మతులకు 46 వేల, వీధి దీపాల మరమ్మతులకు 23,205, కార్యాలయ రంగు పనులకు 34 వేల వరకు ఖర్చులు చూపినట్లు వెల్లడించారు. కార్యాలయ నిర్వహణ పేరుతో 30 వేలకుపైగా వ్యయం నమోదు చేసినప్పటికీ సరైన ఆధారాలు లేవని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందని గ్రామస్థులు పేర్కొన్నారు.
పనుల్లో నాణ్యత లేదని ఆరోపణ
సర్పంచ్ భర్త కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తూ రామాలయం ఎదుట నాణ్యతలేని సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు ఆరోపించారు. పంచాయతీ పాలకవర్గాన్ని పక్కనబెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సతీష్, స్వప్న, శ్రీశైలం, కాంతి, గ్రామస్తులు బద్రు, కుమార్ పాల్గొన్నారు.


