కార్పొరేటర్లకు ఘనంగా సన్మానం
బుడగ జంగం రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం
కాకతీయ, కరీంనగర్ : బేడ బుడగ జంగం రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అభినందన సత్కార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆదివారం శుభ మంగళం గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను వేదిక సభ్యులు శాలువాలతో సత్కరించారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, బుడగ జంగం సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరువగా ఉండి తమ డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. వేదిక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి గుర్తింపు తీసుకువస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు, కుల పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


