జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకువెళ్తాం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకు సాగుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్, అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాటలతో కార్యక్రమాన్ని ఆకట్టుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆది శ్రీనివాస్, జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, కార్మిక వర్గాల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నెలలో మహనీయుల జయంతులు కొనసాగుతున్న నేపథ్యంలో 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే, 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్లలో ఇప్పటికే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుందని వెల్లడించారు. అలాగే సిరిసిల్ల, వేములవాడలో జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహనీయుల సేవలను గుర్తు చేస్తూ వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యువతలో స్ఫూర్తిని నింపాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, పీడీ హౌసింగ్ వెంకట మాధవరావు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీవైఎస్ఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.


