ప్రభుత్వ కేంద్రాల్లోనే మొక్కజొన్న విక్రయించాలి
ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాకతీయ, నల్లబెల్లి : రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు తమ పంటను మధ్యవర్తులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు. మొక్కజొన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాసటగా నిలుస్తోందని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలుకు రూ.2,400 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అజెండా అని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, సర్పంచులు, అధికారులు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.


