కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టులో మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక ఆధారంగా తమపై తక్షణ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇద్దరు నేతలు కోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ (AG) కోర్టులో సమాధానం ఇస్తూ, ఈ కేసును సీబీఐకి అప్పగించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. అయితే, కేసీఆర్, హరీష్రావులపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చ జరగిందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
వాదనలు విన్న అనంతరం, హైకోర్టు ఈ కేసును అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. అంతవరకు కేసీఆర్, హరీష్రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణ తాత్కాలికంగా నిలిచినట్టయింది.


