*సీబీఐ రీఎంట్రీ
*రాష్ట్రంలో కేసుల దర్యాప్తు చేపట్టకుండా గత ప్రభుత్వం జీవో
*తాజాగా ఆ జీవోను రద్దు చేసేందుకు రేవంత్ సర్కారు అడుగులు
*కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలనే నిర్ణయంతో కీలక పరిణామం
*కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్న రాష్ట్ర ప్రభుత్వం
*అనంతరం కాళేశ్వరం కేసును సీబీఐకి బదాలాయించేలా చర్యలు
*ఇప్పటికే వామన రావు దంపతుల హత్య కేసులో శోధనలో దర్యాప్తు సంస్థ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాష్ట్రంలోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. కాళేశ్వరంలో అనేక అక్రమాలు, అవినీతి జరిగిందని పేర్కొంటూ మాజీ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టును ఆదివారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన సభలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ రిపోర్టు గత బీఆర్ ఎస్ ప్రభుత్వం, నాడు సీఎంగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్‌రావు దోషులుగా తేల్చేసిందని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని, కేవలం ప్రభుత్వ నిధులను కాజేయడానికి, కమీషన్లు సంపాదించుకోవడానికే అనువుగాని చోట.. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.
కాళేశ్వరంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని శాషన సభ తీర్మానం చేసుకున్నట్లుగా సీఎం వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలు, మంత్రిత్వ శాఖల రిపోర్టులు కూడా అవసరమైన నేపథ్యంలో ఈకేసును సీబీఐకే అప్పగించడం సముచితమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని కూడా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సీబీఐ రాష్ట్రంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
సీబీఐకి తలుపులు మూసేసిన బీఆర్ఎస్
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలాంటి దర్యాప్తులు, తనిఖీలు చేపట్టకుండా గత బీఆర్ ఎస్ ప్రభుత్వం 2022లో ఆగస్టు 30న ఒక జీవో తీసుకొచ్చింది. అప్పటి రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఈమేరకు జీవోఎంఎస్ నంబరు 51 జారీ చేశారు. అయితే ఈవిషయాన్ని అప్పటి ప్రభుత్వం గోప్యంగా ఉంచగా.. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో సీబీఐ ఏ కేసు విషయంలో రాష్ట్రంలో దర్యాప్తు జరపాలన్నా ముందుగా ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే దర్యాప్తు, తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా దేశరాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలూ ఇందుకు ఎప్పటికప్పుడు సమ్మతి నోటిఫికేషన్‌లు ఇస్తుంటాయి. వాటిప్రకారమే కేంద్ర దర్యాప్తు సంస్థ ముందుకెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రాల సాధారణ సమ్మతి లేకుంటే సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలుండదు. నాటి బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏకంగా జీవోను తీసుకొచ్చి కేంద్ర దర్యాప్తు సంస్థకు తలుపులు మూసేసింది.
నేడు సీబీఐకి కాంగ్రెస్ ఆహ్వానం..!
కాళేశ్వరం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ముందుగా గతంలో జారీ చేసిన జీవోను రద్దు చేయాల్సి ఉంటుంది. ఈప్రక్రియపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు… జీవోరద్దు తర్వాత కాళేశ్వరం కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాయనుంది. ఈమేరకు లేఖను పరిశీలించిన అనంతరం సీబీఐకి కాళేశ్వరం కేసును అప్పగించే అవకాశం ఉంటుంది. అయితే సీబీఐ సాధారణంగా బేసిక్ సమాచారం క్రోడీకరించుకున్న తర్వాత… కేసు ఫీజుబులిలిని అంచనా వేస్తూ ఇన్వెస్టిగేషన్‌కు ముందుకు వస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలన్న నిర్ణయం.. కేంద్ర ప్రభుత్వం సైతం కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు సీబీఐకి వెళ్తుండటం రాజకీయంగాను ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే ఒకటి.. ఇప్పుడు మరోటి..!
మంథని నియోజకవర్గంలో లాయర్ దంపతులు వామనరావు, నాగలక్ష్మి దంపతుల హత్య కేసును విచారించాల్సిందిగా ఇటీవల సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో రెండు కేసులపై సీబీఐ దర్యాప్తు చేయడం.. అవి రెండు కూడా మంథని నియోజకవర్గ పరిధిలోనే ఉండటం గమనార్హం.


