ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు
పేద విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్
కాకతీయ, కొత్తగూడెం : ఫీజు బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని, ఇది పేద విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హామీలతో ప్రైవేటు కళాశాలలు విద్యార్థులను చేర్చుకున్నాయని తెలిపారు. అలాంటిది బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని చెప్పడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్ పథకం కింద ప్రధానంగా పేద విద్యార్థులే లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఈ తీర్పుతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు
ప్రైవేటు కళాశాలలు ఫీజు బకాయిలు రాకపోవడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితుల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఘటనలు ఉన్నాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్, స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును పునఃసమీక్ష చేసి విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాణిక్యాల వినయ్, సంజయ్ కీర్తన, మై సంజన, మానస, స్వప్న స్పందన, కవిత, సోని, ఉదయ్, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


