క్యాంపు కార్యాలయంపై దాడి ఖండనీయం
: నామా నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం : గజ్వేల్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలుస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల కార్యాలయాలపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని, ప్రజాస్వామ్యంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటాయని, ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజల భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయని ఆయన ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధుల కార్యాలయాల భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసిన ఆయన, ఇలాంటి ఘటనలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తాయని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


