పంచాయతీ భవనంపై వివాదం
గ్రామసభ లేకుండానే తీర్మానమా?
నిబంధనలకు విరుద్ధంగా స్థల ఎంపిక
సీతారామపురంలో ఏకపక్ష నిర్ణయాలంటూ ఆరోపణలు
అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం
పనులు నిలిపివేసి గ్రామసభ నిర్వహించాలని డిమాండ్
కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : పంచాయతీ భవన నిర్మాణంలో పారదర్శకత పాటించలేదని, గ్రామసభ నిర్వహించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని సీతారామపురం కాలనీ వాసులు తీవ్రంగా ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామంలో పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన స్థల ఎంపిక వివాదాస్పదంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నిబంధనలను పక్కనబెట్టి తమకు అనుకూలంగా వ్యవహరించారని గ్రామస్తులు మండిపడ్డారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామసభ నిర్వహణలో అన్ని అనుబంధ గ్రామాల ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ కేవలం ఒక రోజు ముందే సమాచారం ఇచ్చి నామమాత్రంగా సభ నిర్వహించారని ఆరోపించారు. మెజారిటీ ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే కొద్దిమంది సమక్షంలో చేతులెత్తించి నిర్ణయం తీసుకోవడం పారదర్శకతకు విరుద్ధమని తెలిపారు.
హామీలు విస్మరించారంటూ గ్రామస్థుల ఆగ్రహం
ఈ నిర్ణయ ప్రక్రియలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించి గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణ సమయంలో పంచాయతీ కార్యాలయాన్ని హనుమాన్ దేవాలయం సమీపంలోని హామ్లెట్లో నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి పాత ప్రాంతంలోనే పనులు ప్రారంభించడం అన్యాయమని మండిపడ్డారు. పంచాయతీ భవన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, అన్ని వర్గాల ప్రజలతో పూర్తి స్థాయి గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


