*నెక్ట్స్ ఎవరు..?
*రెవెన్యూశాఖ అధికారులపై ఏసీబీ ఫోకస్
*ఆదాయం కన్నా ఆస్తులు మిన్నగా ఉన్న వారిపైనే ఫోకస్
*ఆదాయానికి మించి ఆస్తులున్నట్లుగా వెళ్తున్న ఫిర్యాదులు
*ఏసీబీని ఆశ్రయిస్తున్న భూ బాధితులు.. వలవేస్తున్న అవినీతి నిరోధక శాఖ
*ఇప్పటికే ఆర్డీవో రేసులో ఉన్న ఇద్దరు ఎమ్మార్వలకు షాక్
*పోస్టింగ్‌ల విషయంలో పెరిగిన పోటీ.. ఫిర్యాదుల్లోనూ ఉద్యోగుల మధ్య పోటీ..!
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖ ఉద్యోగులపై ఏసీబీ గురి పెట్టింది. లంచగొండులు.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా కొంతమంది అధికారులపై ఫిర్యాదులు వెళ్తుండటంతో నజర్ వేస్తోంది. బాధితులు, వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారంతో ఏసీబీ స్కెచ్ గీస్తోంది. ఆదాయానికి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా ఫిర్యాదులు.. ప్రభుత్వ నిఘా వర్గాల సమాచారంతో దాడులుకు దిగుతుండటం గమనార్హం. భూములు విలువ ఎక్కువగా ఉన్న వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పనిచేసే అధికారులపై ఫిర్యాదులు వెళ్తున్నట్లు సమాచారం.
సోదాలతో రెవెన్యూలో కలవరం..!
సహజంగా కార్యాలయంలో జరిగే పనులకు డబ్బులు డిమాండ్ చేయడం.. భూ రిజిస్ట్రేషన్లు.. ఉచితంగా చేయాల్సిన పనులకు రేట్లు ఫిక్స్ చేసి ఎమ్మార్వోలు కింది స్థాయి ఉద్యోగుల నుంచి వసూళ్లకు తెగబడుతుంటారు. తమ చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేస్తున్న అధికారులను పట్టుకోవడం ఏసీబీకి కూడా అంత సులువు కావడం లేదు. దీంతో తాజాగా ప్రభత్వ నిఘా వర్గాలు, ఇతర ప్రజా సంబంధాలు, ఫిర్యాదు దారుల నుంచి వస్తున్న సమాచారంతో ఆదాయానికి మించిన ఆస్తులేమైనా ఉన్నాయా అంటూ తనిఖీలు దిగుతుండటం గమనార్హం. ఇప్పటి వరకు ఈ తరహా సోదాలు గడిచిన ఏడాదిన్నర కాలంలో ఇద్దరి ఎమ్మార్వలో ఇళ్లలో చోటు చేసుకున్నాయి.
గతంలో ధర్మసాగర్ ఎమ్మార్వోగా పనిచేసి ఎన్నికల ముందు పొరుగు జిల్లా జమ్మికుంటకు బదిలీపై వెళ్లిన అధికారి రజని ఇళ్లపై ఏడాదిన్నర క్రితం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. రజనిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో నిలబెట్టారు. ఏసీబీ విచారణ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. తాజాగా ఖిలా వరంగల్ తహసీల్దార్‌గా పనిచేసిన బండి నాగేశ్వర్ ఇళ్లపైనా ఇదే తరహాలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సుమారు రూ.5కోట్ల పైచిలుకు అక్రమాస్తులను గుర్తించినట్లుగా ఏసీబీ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇద్దరు ఆర్డీవో రేసులో ఉన్నవాళ్లే..!
ధర్మసాగర్ ఎమ్మార్వోగా పనిచేసిన రజని రెడ్డి, ఖిలా వరంగల్ తహసీల్దార్‌గా పనిచేసిన బండి నాగేశ్వర్‌రావులు ఇద్దరు కూడా ఆర్డీవో రేసులో ఉన్నవారే కావడం గమనార్హం. వాస్తవానికి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఎమ్మార్వోలు సహకరించకపోతే ట్రాన్సఫర్ బహుమానంగా ఉంటోందన్న విమర్శలు ఆ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో కూడా చాలా వరకు వాస్తవం ఉంది. నిజాయితిగా ఉంటే.. ఎమ్మెల్యే సహా ఇతరప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు కూడా ఉంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
ఈనేపథ్యంలోనే.. స్వామికార్యం.. స్వకార్యం అన్న రీతిలో ఎమ్మార్వోల అక్రమాలు.. అవినీతి వ్యవహారాలు అలా జరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా రెవెన్యూ ఉద్యోగుల మధ్య ఉన్న పోస్టింగ్‌ల పోటీ .. అంతర్గత విబేధాలతో కూడా తమ అనునయులతో ఏసీబీకి ఒకరిపై మరోకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది. ఏసీబీ నజర్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌పై కొనసాగుతోందని.. నెక్ట్స్ ఎవరో చూడాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.


