డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజాపోరాటం
ప్రాణాలతో ఆటలాడితే సహించబోం
భూగర్భ జలాలు కలుషితమవుతాయి..
ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హుజురాబాద్‌లో ఉద్యమానికి ఎంపీ మద్దతు
కాకతీయ, హుజురాబాద్ : ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా హెచ్చరించారు. హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనకు మద్దతుగా ఆయన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జవహర్‌నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడి పరిస్థితులు హుజురాబాద్‌లో పునరావృతం కాకూడదని అన్నారు. ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
చెత్త ప్లాంట్లు పేరుకే అంటూ విమర్శ
చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామనే వాదన కేవలం మాటలేనని, ఆ ప్లాంట్లు సక్రమంగా పనిచేయవని ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ ప్రాజెక్టుల ప్రభావంతో భూగర్భ జలాలు కాలుష్యానికి గురై, చెరువులు, బోర్లు పూర్తిగా నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ల నుంచి కారే ద్రవాలు తీవ్రమైన దుర్వాసనతో పాటు వ్యాధులను వ్యాప్తి చేస్తాయని, ట్రీట్మెంట్ ప్లాంట్లు కేవలం పేరుకే ఉంటాయని ఆరోపించారు. రాజకీయాల కోసం తాను రాలేదని, ప్రజల పక్షాన నిలబడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అవసరమైతే ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటును పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, హుజురాబాద్ ప్రజలతో కలిసి చివరివరకు పోరాటం కొనసాగిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.


