చంద్ర రథోత్సవానికి సిద్ధం ఇల్లందకుంట దేవస్థానం
భక్తుల రాకకు విస్తృత ఏర్పాట్లు
అలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు
కాకతీయ, జమ్మికుంట/ ఇల్లందకుంట : చంద్ర రథోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న చంద్ర రథోత్సవానికి దేవస్థానం కమిటీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, ఎండ నుంచి రక్షణకు వైట్ పాండాల్లు, త్రాగునీటి సదుపాయం, ప్రాథమిక వైద్య సేవలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారు చంద్రరథంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పెద్ద రథోత్సవం దేవస్థానం మాడవీధుల గుండా భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా సాగుతుందని తెలిపారు. ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కరుణాకటాక్షాలు పొందాలని కోరారు. దేవస్థానానికి అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వాహణ అధికారి సుధాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


