జోరుగా ఇసుక అక్రమ రవాణా
ఏటూరునాగారంలో రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలింపు
గ్రామస్థులు అడ్డుకుంటున్నా ఆగని దందా
అధికారుల స్పందనపై సందేహాలు
కాకతీయ, ఏటూరునాగారం : ఇసుక అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని ఏటూరునాగారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో రాత్రివేళల్లో భారీగా ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు వ్యక్తులు “ఇందిరమ్మ” పేరుతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెబుతున్నారు. ప్రతిరోజూ పది ట్రాక్టర్లకు పైగా ఇసుక రవాణా జరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. ట్రాక్టర్లు గ్రామ వీధుల గుండా వెళ్లడంతో శబ్ద కాలుష్యం పెరిగి ప్రజలకు నిద్రలేకపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు దెబ్బతినడంతో పాటు పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అధికారుల స్పందనపై సందేహాలు
ఈ విషయంపై ఎమ్మార్వోను సంప్రదించగా చర్యలు తీసుకుంటామని, సిఐకు సమాచారం ఇచ్చామని తెలిపినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పనులకు ఇసుక లేకపోవడంతో పాటు అక్రమ రవాణా కొనసాగడం ఆశ్చర్యకరమని గ్రామస్తులు అంటున్నారు. “ఇందిరమ్మ” పేరును ముసుగుగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని కోరుతున్నారు. అక్రమ రవాణాను వెంటనే నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రహదారి దిగ్బంధనలు సహా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.


