కమనీయం గోదా రంగనాయకుల కల్యాణం
ఆలయం చుట్టూ బండ్ల ప్రదక్షణ భక్తి పారవశ్యం
వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవం
కాకతీయ, నెల్లికుదురు : గోదా రంగనాయకుల దివ్య కళ్యాణం భక్తులను ఆధ్యాత్మిక పరవశ్యంలో ముంచెత్తిందని నిర్వాహకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ నామస్మరణలతో పట్టణం మారుమోగింది. నెల్లికుదురు పట్టణంలోని చారిత్రక శ్రీ భూనీల గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు లక్ష్మణ చార్యులు, హరిచార్యులు ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ వేడుక భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ధర్మకర్తలు నాయిని వెంకటరెడ్డి దంపతులు స్వామివారికి చీరలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని దర్శించారు. రంగా రంగా నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆలయం చుట్టూ బండ్ల ప్రదక్షణ నిర్వహించి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతున్న ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి.


