వరంగల్ చెరువులకు పునర్జీవం కల్పిస్తాం
ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం
పూడికతీత పనులతో నిల్వ సామర్థ్య పెంపు
నగరానికి ట్యాంక్‌బండ్ తరహా సౌందర్యం
సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు మేలు
దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చిన్న వడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అమృత్ పథకం కింద చేపట్టిన ఈ పనులతో చెరువుల నిల్వ సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. చెరువులు కేవలం నీటి నిల్వలకే పరిమితం కావని మంత్రి వివరించారు. అవి భూగర్భ జలాల పెంపుతో పాటు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నగరంలోని చెరువులను ట్యాంక్‌బండ్ తరహాలో తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఉర్సు రంగసముద్రం, దేశాయిపేట చెరువుల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి వివరించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాల వల్ల విద్యార్థుల హాజరు, ఆరోగ్యం మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు.
ఉపాధి, అభివృద్ధి రెండింటిపై దృష్టి
టెక్స్టైల్ పార్క్ నేపథ్యంలో స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆధునిక కుట్టు యంత్రాలపై శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. మహిళల ఆర్థిక సాధికారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పనులు నగరాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ పనులతో ప్రజలకు శుభ్రమైన వాతావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్య శారద, చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేటర్లు సురేష్ జోషి, మరుపల్ల రవి తదితరులు పాల్గొన్నారు.


