కాకతీయ ఎఫెక్ట్
వీపీఆర్ కంపెనీలో సేఫ్టీ తనిఖీలు
ప్రమాదం తర్వాత మైన్స్ సేఫ్టీ విభాగం రంగంలోకి
ఫిట్‌నెస్ లేని వందకు పైగా డంపర్లు నిలిపివేత
భద్రతా నిబంధనలపై కఠిన ఆదేశాలు

కాకతీయ, మణుగూరు టౌన్ : కాకతీయలో వెలుగులోకి వచ్చిన ప్రమాద ఘటనతో మణుగూరు ప్రాంతంలోని విపిఆర్ దుర్గ ఓబీ కంపెనీలో అధికార యంత్రాంగం కదిలింది. సింగరేణి మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్-2 పరిధిలో పనిచేస్తున్న ఈ కంపెనీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో మైన్స్ సేఫ్టీ విభాగం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. కంపెనీలో పనిచేస్తున్న వాహనాల్లో ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, అనుమతులు లేకుండా నడుస్తున్న డంపర్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సుమారు వందకు పైగా సానీ డంపర్లను తక్షణమే నిలిపివేస్తూ పార్కింగ్ యార్డుకు పరిమితం చేశారు.

ఫిట్‌నెస్ లేని వాహనాలు వందల్లో
గురువారం సెకండ్ షిఫ్ట్ బ్లాస్టింగ్ అనంతరం వాహనాల స్థితిని పరిశీలించిన అధికారులు మొత్తం భారీ డంపర్లలో కేవలం ముప్పై ఐదు వాహనాలకే ఫిట్‌నెస్ అనుమతులు ఉన్నట్లు గుర్తించారు. మిగతా వాహనాలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తేలడంతో వాటి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓబీ కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యానికి కఠిన ఆదేశాలు జారీ చేశారు.

భద్రతా చర్యలపై హెచ్చరికలు
కార్మికులు తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలనీ, పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలనీ సూచించారు. హాల్ రోడ్ల నిర్వహణ, లైటింగ్ వ్యవస్థ, వాటర్ స్ప్రేయింగ్ వంటి అంశాల్లో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని ఆదేశించారు. అదే విధంగా కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రతి రోజు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మరియు స్టాండర్డ్ ఆపరేషన్ విధానాల ప్రకారం పనులు నిర్వహించాలనే దిశగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక పర్యవేక్షణ బాధ్యతలో భాగంగా సింగరేణి యాజమాన్యానికి కూడా ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గనుల్లో భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కాకతీయ కథనంతో బయటపడిన ప్రమాదం అనంతరం అధికారులు కదిలి చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపై గనుల్లో భద్రతా ప్రమాణాలు ఎంతవరకు ఖచ్చితంగా అమలు అవుతాయన్నది చూడాల్సి ఉంది.


