డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్ బంద్
వ్యాపారులు, ప్రజల స్వచ్ఛంద మద్దతు…
పూర్తి స్థాయిలో మూతపడిన దుకాణాలు
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణం శుక్రవారం ప్రజా గర్జనతో మార్మోగింది. ‘వేస్ట్ టు ఎనర్జీ’ డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపుతో చేపట్టిన బంద్‌కు విస్తృత స్పందన లభించింది. పట్టణం మొత్తం ఒకే స్వరంతో నిరసన వ్యక్తం చేయడంతో డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటం మరింత ఉధృతమైంది.
ఉదయం మొదలైన బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. నిత్యావసర సేవలు మినహా అన్ని రంగాలు బంద్‌లో పాల్గొనడం గమనార్హం. పెట్రోల్ బంకులు సైతం స్వచ్ఛందంగా మూసివేసి నిరసనకు మద్దతు తెలపడం ఉద్యమ తీవ్రతను చాటింది.

ఇక ఉదయం నుంచే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగుతూ డంపింగ్ యార్డ్ వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలకు వివరించారు. వ్యాపారులను కలిసి బంద్‌కు సహకరించాలని కోరగా, ప్రజలు, వ్యాపారులు ఉత్సాహంగా స్పందించారు.
సిరసపల్లి శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షలు 12వ రోజుకు చేరుకోవడంతో ఉద్యమం మరింత వేడెక్కింది. అంబేద్కర్ చౌరస్తాలో నిరసనకారులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా ఉన్న ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో బలగాలను మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. ర్యాలీలు, నిరసనలు జరిగినప్పటికీ ఎక్కడా ఉద్రిక్తతలు చోటుచేసుకోకపోవడం గమనార్హం.
మొత్తంగా ప్రజలు, వ్యాపారులు ఒకే తాటిపైకి వచ్చి బంద్‌ను విజయవంతం చేయడంతో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని పునరాలోచించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పోరాటం ఇకపై మరింత ఉధృతం కావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.


