అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
ఇద్దరు యువకులు మృతి
కాకతీయ, కరీంనగర్ : నగర శివారులోని బైపాస్ రోడ్డుపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో సయ్యద్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇంకొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఢీకొన్న తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


